శంకర్ పల్లి లో మిషన్ భగీరథ నీరు వృధా… మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

శంకర్పల్లి ప్రజల ఆగ్రహం
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి రోడ్డుపై, రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ఎదుట మిషన్ భగీరథ పైపు పగిలి నెలల తరబడి నీరు వృథాగా పారుతున్నా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల తాగునీటి అవసరాల కోసం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ పథకం నీరు ఇలా రోడ్లపై వృథాగా పారుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.
పగిలిన పైపులోంచి నిరంతరం కారుతున్న నీరు గణేష్ నగర్ కాలనీలోకి చేరి రోడ్లు, ఇళ్ల ముందు మురికి నీటి ప్రవాహంగా మారుతోంది. దీంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సానికే మహేష్ పలుమార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా, వారు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెలలుగా నీరు వృథాగా పారుతుండటం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పగిలిన మిషన్ భగీరథ పైపును మరమ్మతు చేయాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాధనంతో అమలైన పథకాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రజలు ఇక మౌనంగా ఉండరని హెచ్చరిస్తున్నారు.


