శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ


జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి:
పోలీసులమని పరిచయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి వద్ద నుంచి అర తులం బంగారం మోసం చేసిన ఘటన శంకరపల్లి పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు కావలి కుమార్ (59)గా గుర్తించారు.
అంతప్పగూడ గ్రామానికి చెందిన కావలి కుమార్ ఈరోజు ఉదయం బ్యాంకు పనిమీద తన సొంత స్కూటీపై శంకరపల్లి వైపు బయలుదేరారు. ఫాతేపూర్ బ్రిడ్జి సమీపానికి రాగానే రామంతాపూర్ వైపు నుంచి ఒక బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని వాహనాన్ని ఆపారు. తమను పోలీసులు అని పరిచయం చేసుకుని ఐడీ కార్డులు చూపించారు. ఆ ప్రాంతంలో ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అనంతరం, చేతికి ఉన్న బంగారు ఉంగరాలను బహిరంగంగా ధరించడం ప్రమాదకరమని చెప్పి వాటిని తీసి ఒక కవర్లో పెట్టి దాచుకోవాలని సూచించారు. బాధితుడు వారి మాటలను నమ్మి ఉంగరాలను తీసి ఇవ్వగా, వారు కవర్‌లో పెట్టినట్లు నటించి అదే కవర్‌ను తిరిగి అతని స్కూటీలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కావలి కుమార్ శంకరపల్లి చేరుకుని బ్యాంకులోకి వెళ్లిన తర్వాత అనుమానం వచ్చి కవర్‌ను తెరిచి చూడగా, అందులో బంగారం స్థానంలో రెండు రాళ్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే శంకరపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు శంకరపల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు.
పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, తమను పోలీసులు అని చెప్పుకునే అనుమానాస్పద వ్యక్తులను వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి బంగారం లేదా విలువైన వస్తువులు అప్పగించవద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

You may also like...

Translate »