దేవుని భూమి కబ్జా చేసిన మాజీ ఎంపీటీసీ?

జ్ఞానతెలంగాణ,యాచారం:
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన ఎండోమెంట్ భూములు అక్రమంగా పట్టా చేసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 98/2లో ఉన్న మూడు ఎకరాల భూమిని భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ తన సతీమణి గౌర వసంత పేరుతో దొంగచాటుగా పట్టా చేసుకున్నారని ఆలయ పరిరక్షణ కమిటీ ఆరోపించింది.
ఈ అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కమిటీ అధ్యక్షుడు బండ మల్లేష్, కార్యదర్శి మండల సత్యనారాయణ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్న గౌర మల్లేష్, అధికార ప్రభావంతో దానిని స్వంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేవాలయ ఆస్తిని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా యంత్రాంగం తక్షణమే సర్వే నిర్వహించి అక్రమ పట్టాను రద్దు చేసి భూమిని తిరిగి దేవాలయ పేరుకు నమోదు చేయాలని వారు కోరారు. ఆలయ భూముల పరిరక్షణ కోసం గ్రామ ప్రజలు ఐక్యంగా పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
