కాలె యాదయ్యకు ప్రొద్దుటూరు ప్రజల తుది హెచ్చరిక

- 20 ఏళ్ల వేదన – మా రోడ్డు వెంటనే నిర్మించండి!
- ప్రగతివైపు రోడ్డు… పనికిరాని పాడైన బాటే!
- నీటి మూటలా ఎమ్మెల్యే వాగ్దానాలు
- ప్రతి అడుగులో ప్రమాదం – 20 ఏళ్ల నిర్లక్ష్యం
- వాహనాలు, స్కూల్ బస్సులు, అంబులెన్స్… అందరికి ప్రత్యక్ష నరకం
- కట్టలు తెంచుకున్న ప్రొద్దుటూరు గ్రామ ప్రజల ఆగ్రహం
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో రోడ్డు సమస్య తీవ్ర స్థాయికి చేరింది. గ్రామంలోని ప్రగతి వైపు వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డు, అలాగే టంగుటూరు వైపు రోడ్డు పాడైపోయి, గుంతలతో నిండిపోయింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు, విద్యార్థుల పాఠశాల ప్రయాణాలకు, రోగుల అంబులెన్స్ సౌకర్యానికి తీవ్ర అవరోధం ఏర్పడింది.
గ్రామస్థులు మండిపడుతూ, “ఎమ్మెల్యే కాలె యాదయ్య గారు… మేము మీ వెంట నిలబడి, మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ మా రోడ్డు రెండు దశాబ్దాలుగా అలాగే ఉంది. ఇంత నిర్లక్ష్యం మేమెప్పుడూ చూడలేదు. వెంటనే రోడ్డు నిర్మించకపోతే మేము మౌనంగా ఉండబోం” అని హెచ్చరించారు.ప్రతి అడుగు, ప్రతి గుంత గ్రామస్తుల రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తోంది. వాహనాలు, స్కూల్ బస్సులు, అంబులెన్స్ రోడ్డు సమస్యతో ఇబ్బందిపడుతున్నాయి. 20 సంవత్సరాల నిర్లక్ష్యం, హామీల ఫలితం లేకపోవడం, గ్రామస్తుల ఆవేదనను మరింత పెంచింది.గ్రామ పంచాయతీ, స్థానిక నాయకులు, మాజీ వార్డు సభ్యులు కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. కోఆప్షన్ మాజీ సభ్యులు కవేలి జంగారెడ్డి, పులకండ్ల రఘుపతి రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కవేలి రాంరెడ్డి, చాకలి రాములు, కవేలి గోవర్ధన్ రెడ్డి, కవేలి యాదిరెడ్డి, సింహం రాజు, అలాగే ఎమ్మార్పీఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బూడిదల మల్లేశ ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల డిమాండ్‌కు మద్దతు తెలిపారు.
