దళిత హెచ్ఎం రాములుపై మతోన్మాదుల దాడి

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) ఖండన
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్ఎం) రాములు (దళితుడు) పై మతోన్మాద మూకలు భక్తి ముసుగు వేసుకొని ఉద్దేశపూర్వకంగా దాడి చేయడాన్ని టి అర్ టి ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది . ఈ మేరకు టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ , ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21న తుక్కుగూడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను లెక్కలు అడిగిన సందర్భంగా సరిగ్గా చెప్పనందుకు ఓ విద్యార్థిని ఆ హెచ్ఎం పక్కకు నిలబెట్టారని తెలిపారు. దాన్ని అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని కాలితో తన్నాడనే దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి కొంత మంది మతోన్మాద మూకలని సమీకరించి ప్రణాళికాబద్ధంగా హెచ్ఎం రాములుపై దాడి చేశారని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పినా వినకుండా, అక్కడున్న మాలను ధరించిన విద్యార్థి, ఇతర స్వాముల కాళ్లు మొక్కించడం అత్యంత హేయమని వివరించారు. దాడికి గురైన హెచ్ఎం రాములు దళితుడని తెలిపారు. ఈ సంఘటన ఉపాధ్యాయుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మతోన్మాదుల జోక్యం సరికాదని తెలిపారు. ఈ దాడి విషయాన్ని ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా పరిగణించి నిందితులపై అట్రాసిటీ కేసులను నమోదు చేసి విధి నిర్వహణలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి భారత న్యాయ సంహిత ప్రకారం బన్స్ 121 సెక్షన్ కింది చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.