శంకర్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్‌లో ‘అరైవ్ అండ్ అలైవ్’ కార్యక్రమం

  • రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన – సీఐ శ్రీనివాస్ గౌడ్
  • విద్యతో పాటు రోడ్డు భద్రత అవగాహన కూడా అవసరం” – ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:
శంకర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ (టెక్నో కరికులం) లో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐ లు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు, జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగం వంటి అంశాలను వారు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్ ప్రయాణికులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలి అని స్పష్టం చేశారు.
పాదచారుల భద్రతపై కూడా అధికారులు ప్రత్యేకంగా మాట్లాడారు. జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు దాటే సమయంలో ఇరు వైపులా చూసి దాటడం, పిల్లలు రోడ్డుపై ఆడకూడదనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 100 / 112 కు కాల్ చేయడం, బాధితుడికి ప్రాథమిక సహాయం అందించడం ఎంత ముఖ్యమో వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, “విద్యతో పాటు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, భద్రతా అవగాహన పెంపొందించడం కూడా అత్యంత అవసరం. చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే, వారు జీవితాంతం ట్రాఫిక్ నియమాలను గౌరవించే బాధ్యతాయుత పౌరులుగా మారుతారు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తాం” అని తెలిపారు.
విద్యార్థులు చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలు పాటిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని, “సురక్షితంగా వెళ్లి సురక్షితంగా తిరిగి రావడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని సీఐ శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు పోలీస్ అధికారులు సమాధానాలు ఇచ్చి, రోడ్డు భద్రతపై అవగాహన మరింత పెంచారు. ఈ తరహా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖ–విద్యా సంస్థల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడతాయని వారు తెలిపారు.

You may also like...

Translate »