ఏసీబీ వలలో ఆమనగల్ తహశీల్దారు,సర్వేయర్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :

ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడటంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.ఆమనగల్‌ మండల రెవెన్యూ అధికారి చింతకింది లలిత, మండల సర్వేయర్‌ కోట రవి లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు రిజిస్ట్రేషన్‌ చేయడానికి, రికార్డుల్లో కొన్ని కరెక్షన్స్‌ చేయడానికి తహసీల్దార్‌, సర్వేయర్‌ చెరొక రూ.50 ఇవ్వాలని డిమాండ్‌ చేశారని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.దాంతో హైదరాబాద్‌ నగర రేంజ్‌ రెండో యూనిట్‌కు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. సర్వేయర్‌ ఫిర్యాదుదారు నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రిజిష్ట్రేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టడం కోసం తహసీల్దార్‌ లలిత అప్పటికే రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు. నిందితులిద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.ఈ మేరకు తెలంగాణ అవినీతి నిరోధక విభాగం ప్రజాసంబంధాల అధికారి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం కోసం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 నెంబర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

You may also like...

Translate »