ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం చేయాలి

- క్రింది స్థాయి పోలీస్ అధికారుల నిర్లక్ష్యంపై సీపీకి వినతి
- సీపీని కలిసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు
జ్ఞాన తెలంగాణ, రామగుండం ప్రతినిధి :
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో నమోదవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో క్రింది స్థాయి పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాను కలిసి వినతిపత్రం అందజేశారు.
పెద్దపల్లి జిల్లా పరిధిలోని పెద్దపల్లి, గోదావరిఖని (8 ఇంక్లైన్ కాలనీ), సుల్తానాబాద్ వంటి ప్రధాన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతర కులాల వారు ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించి, దాడులకు పాల్పడుతున్నా, బాధితులు ఫిర్యాదులు చేస్తే పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదని, ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని సీపీ దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే, బాధితులు న్యాయం కోసం ఫిర్యాదు చేసినా మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, కొన్నిచోట్ల కులం పేరుతో దూషించి దాడి చేసిన వారికే కొంతమంది పోలీస్ అధికారులు అండగా నిలిచి, బాధితులపై కౌంటర్ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులను సమీక్షించి, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీకి విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన వారిలో
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య,
సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు,
జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్,
ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకరయ్య,
కాలేశ్వరం జోన్ అధ్యక్షులు బచ్చలి రాజయ్య,
మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అరికెళ్ల రామలక్ష్మి,
బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షురాలు రామిల్ల శారద,
ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు కనకం గణేష్,
దళిత నాయకులు విష్ణు తదితరులు పాల్గొన్నారు.
