సంత్ రవి దాస్ పుణ్య తిథి: సమానత్వ సందేశాన్ని స్మరించుకునే పవిత్ర దినం.

  • అరియ నాగసేన బోధి
    M.A.,M.Phil.,TPT.,LL.B
    ధమ్మ ప్రచారకులు

డిసెంబర్ 3వ తేదీ సంత్ రవి దాస్ పుణ్య తిథిగా నిర్వహించబడుతుంది. మహానుభావులు పరమపదించిన రోజును పుణ్య తిథి అంటారు. ఆ రోజున వారి జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ సమాజం తిరిగి ఆలోచనలో మునిగే అవకాశం పొందుతుంది. పుణ్య తిథి అనేది ఒక ఆత్మపరిశీలనా రోజు – మహాత్ములు చూపిన మార్గాన్ని మన జీవితాల్లో ఎలా అనుసరించాలనే విషయంపై మనసును కేంద్రీకరించే పవిత్ర సమయం.

సంత్ రవి దాస్ జీవితం ఒక గొప్ప సందేశం. ఆయన కాలంలో సమాజంలో మూఢనమ్మకాలు, కులవివక్షలు, గుడ్డి భక్తి, దురాచారాలు బలంగా నెలకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సత్యం, సమానత్వం, నైతికత, కర్మమార్గం గురించి స్పష్టమైన బోధనలను అందించి ప్రజలకు కొత్త దారిని చూపారు. “సత్యం ఇతరుల మాటల్లో కాదు – స్వయాన అనుభవంలోనే ఉంటుంది” అనే ఆయన వాక్యం ఆధ్యాత్మికతకు కొత్త నిర్వచనం ఇచ్చింది.

చమార్ కులంలో పేదరికంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుంచే దైవభక్తిలో మునిగిపోయారు. ఆయన చెప్పులు కుట్టే కులవృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ నిరాడంబరమైన ఆధ్యాత్మిక జీవితం గడిపారు. తీర్థయాత్రికులకు ఉచితంగా చెప్పులు ఇవ్వడం ద్వారా సేవాభావాన్ని చూపారు. ఆయన కీర్తనలు, దోహాలు, భజనలు ప్రజల మనసుల్లో సమానత్వానికి కొత్త జ్యోతి వెలిగించాయి.

గురు రవిదాస్ బోధనలలో అసలు సారాంశం : “కులం కాదు గొప్పది, కర్తవ్యం గొప్పది”; “సృష్టి ఒకే జ్యోతితో జరిగింది, అందరూ దేవుని పిల్లలే”; “ధర్మం, కర్మం రెండూ సమానమే”. ఈ బోధనలు బుద్ధుని ధర్మంతో, సంత్ కబీర్ దాస్ ఉపదేశాలతో సమానంగా వినిపిస్తాయి. రవి దాస్, కబీర్, బుద్ధుడు ముగ్గురూ సమానత్వం, నైతికత, సత్యం, కరుణ అనే శాశ్వత విలువలను పునరుద్ఘాటించారు.

రవి దాస్ బోధనల ప్రభావం రాజులు, రాణుల నుండి సాధారణ ప్రజలకు వరకు వ్యాపించాయి. చిత్తోడ్‌గడ్ రాణా సాంగా తల్లి రతన్ కువారీ, మీరాబాయి, కాశీ మహారాజులు మరియు అనేకమంది ఆయన శిష్యులయ్యారు. నిరాడంబర జీవనంలో ఉన్నప్పటికీ రవి దాస్ ఆధ్యాత్మిక మహిమ ప్రపంచమంతా వ్యాపించింది. ఆయన దోహాలు, పాడిన భక్తిగీతాలు ఉత్తర భారతదేశం మాత్రమే కాదు, సిక్కు సంప్రదాయం సహా అనేక సంస్కృతులకు ప్రభావం చూపాయి. గురు గ్రంథ్ సాహిబ్ లో ఆయన పదాలు చేర్చబడటం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.

డా. బి.ఆర్. అంబేడ్కర్ కూడా సంత్ రవి దాస్ బోధనల పట్ల గొప్ప గౌరవం చూపారు. ఆయన వ్రాసిన “Untouchables: Who Were They?” గ్రంథాన్ని సంత్ రవి దాస్‌కు అంకితం చేశారు. సమాజంలో అంటరానితనం, కులవివక్షలపై రవి దాస్ చేసిన ఆధ్యాత్మిక పోరాటం అంబేడ్కర్ సామాజిక దృక్పథానికి ప్రేరణగా నిలిచింది.

సంత్ రవి దాస్ చూపిన మార్గం నేటికీ సమానంగా ప్రాసంగికం. మానవ సమానత్వం, కర్తవ్యనిష్ఠ, నిజాయితీ, సేవ ఇవి సమాజ నిర్మాణానికి అవసరమైన శాశ్వత విలువలు. ఆయన జీవితం మనకు చెబుతుంది: భగవంతుడు మనసులోని పవిత్రతలో ఉంటాడు, కులంలో కాదు; సేవలో ఉంటాడు, సంపదలో కాదు; సత్యంలో ఉంటాడు, గుడ్డి భక్తిలో కాదు.

సంత్ రవి దాస్ పుణ్య తిథి సందర్భంగా ఆయన బోధనలు మనసులోని అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక జ్ఞాన దీపంలా నిలుస్తాయి. సమానత్వం మరియు మానవత్వం కోసం ఆయన చేసిన ఆధ్యాత్మిక విప్లవం అనుసరణీయం, ఆచరణీయం.

You may also like...

Translate »