విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, అంతర్ రాష్ట్ర నిందితుడి అరెస్టు


  • చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి జనవరి 16:
విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ జి.రమేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే, నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయల కార్ కరుణభాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమారుడిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలపై చింతపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఈ కేసును లోతుగా విచారిస్తుండగా,శుక్రవారంఉదయం సుమారు 11 గంటల సమయంలో మాల్ గ్రామం – మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని గుర్తించిన చింతపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా
నిందితుడిని ముప్పాళ్ల లీలా కృష్ణ గా గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఇతడు నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు విద్యార్థుల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది.పట్టుబడిన నిందితుడు గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడి పరిచయాలను ఉపయోగించుకొని, భారతదేశానికి వచ్చిన అనంతరం చెడు వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడ్డాడని విచారణలో వెల్లడైంది. విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి ఇప్పటివరకు మొత్తం 8 మంది నుండి సుమారు రూ.85 లక్షల వరకు తీసుకొని మోసం చేసినట్లు గుర్తించారు.ఈ విదంగా సంపాదించిన డబ్బులతో నిందితుడు కొంత డబ్బును విలాసాలకు , జల్సాలకు ఖర్చు పెట్టినాడు. నిందితుని వివరాల్లోకి వెళితే
ముప్పాళ్ల లీలా కృష్ణ తండ్రి వెంకట్రావు, వయస్సు 35 సంవత్సరాలు, వృత్తి ప్రైవేట్ ఉద్యోగి
,గ్రామం బండారుపల్లి,తాడికొండ మండలం,గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని పోలీసులు తెలిపారు.
విచారణలో అతని వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను , వివిధ బ్యాంకుల డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ మరియు వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.ఈ కేసులో నేరస్థుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబర్చిన నాంపల్లి సీఐ శ్రీ డి.రాజు, చింతపల్లి ఎస్‌ఐ శ్రీ ఎం.రామ్మూర్తి మరియు చింతపల్లి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
ఈసందర్బంగా అడిషనల్ ఎస్పి మాట్లాడుతూ యువతను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో నియామకాలు చేయిస్తామని మోసగాళ్లు నమ్మిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాల పేరుతో ముందస్తుగా డబ్బులు అడగడం, నకిలీ నియామక పత్రాలు చూపించడం, వాట్సాప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా తప్పుడు హామీలు ఇవ్వడం వంటి పద్ధతులతో అమాయకులను మోసం చేస్తున్నారని హెచ్చరించారు.
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అధికారిక నోటిఫికేషన్లు, గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారానే పొందాలని సూచించారు. ఉద్యోగం పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరిస్తూ, జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండి మోసాలకు గురికాకుండా పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

You may also like...

Translate »