పోలీసులపై మందు బాబుల దాడి

– మద్యం మత్తులో చితకబాదిన మందు బాబులు
జ్ఞాన తెలంగాణ,నల్గొండ ప్రతినిధి,నవంబర్ 08:
నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో మద్యం మత్తులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు మందలించగా, వారు మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి పోలీసులపై దాడికి తెగబడ్డారు. సమాచారం ప్రకారం, రాత్రి వేళ పట్టణంలోని ప్రధాన వీధిలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను చండూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వారిని ప్రశాంతంగా వెళ్లమని హెచ్చరించగా, వారు అహంకారంతో మాట్లాడుతూ పోలీసులపై దూషణలకు దిగారు. అంతటితో ఆగక మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీసులపై దాడి చేసి చితకబాదినట్లు సమాచారం.
ఈ దాడిలో ఇద్దరు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు మధ్యలో జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం బాధిత పోలీసులు స్టేషన్‌కు వెళ్లి ఘటనపై అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ముగ్గురు మందుబాబులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
