వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు మరొక కుటుంబాన్ని కుదిపేశాయి. 29 ఏళ్ల వివాహిత జె.కావ్య అలియాస్ మానస ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల క్రితం కావ్యకు రాజుతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది కాలంలోనే భర్త రాజు అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడని.. అలాగే పిల్లలు పుట్టడం లేదని మానసికంగా, శారీరకంగా హింసించాడని వారు ఆరోపిస్తున్నారు.
ఈ వేధింపులు తాళలేకపోయిన కావ్య ఆగస్టు 17న భర్తకు ఫోన్ చేసి చివరి మాటలు చెప్పి, ఇంట్లోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలి సోదరి సుమలత మాట్లాడుతూ.. నిరంతర వేధింపులే నా సోదరి ప్రాణాలు తీశాయని.. మా అక్క భర్త, అత్తమామలే ఈ దారుణానికి కారణం అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరకట్న వేధింపులు మరోసారి మహిళ ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా ఆగ్రహానికి కారణమైంది