రాజ్యాంగం పవిత్ర గ్రంథమెలా అవుతుంది?: మాజీ సీబీఐ చీఫ్

- ఓకవేళ అదే పవిత్ర గ్రంథమైతే
- 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని
- హిందువులపై రాజ్యాంగపరంగా వివక్ష ఉందని ఆరోపణ
- మైనారిటీగా ఉన్నచోట హిందువుల జీవనం ప్రశ్నార్థకమంటూ ఆవేదన
- విద్యాహక్కులోనూ హిందువులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్య
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:
భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే, దానికి ఇప్పటివరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత వంటి గ్రంథాలకు ఎటువంటి సవరణలు జరగలేదని ఆయన గుర్తుచేశారు.శనివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ క్లబ్‌లో పాత్రికేయులు, మేధావులతో నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష” అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇతర మతాల వారు సురక్షితంగా జీవించగలుగుతున్నారని, కానీ ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారి మనుగడే ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కశ్మీర్‌లో 21 శాతంగా ఉన్న హిందువుల జనాభా, నేడు ఒక్క శాతం కూడా లేని దుస్థితికి చేరిందని తెలిపారు. లౌకికవాదం గురించి చెప్పే రాజ్యాంగం, కశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని ఎందుకు ఆపలేకపోయిందని ఆయన నిలదీశారు.
విద్యా హక్కు విషయంలోనూ హిందువుల పట్ల వివక్ష కొనసాగుతోందని నాగేశ్వరరావు ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28, 29, 30 ప్రకారం క్రైస్తవులు, ముస్లింలకు విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉందని, కానీ హిందువులకు మాత్రం అది కేవలం పౌర హక్కుగానే పరిమితమైందని ఆయన విశ్లేషించారు.
