భక్తి శ్రద్ధలతో మోకిలలో అయ్యప్పపడిపూజ !

- మోకీల నరసింహ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు, భక్తుల సందడి
జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి నవంబర్ 18 :
మోకీల గ్రామంలోని ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పవిత్రమైన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఘనంగా నిర్వహించారు.
అయ్యప్ప మాల ధరించిన స్వాములు అత్యంత నియమ నిష్టలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేకువ జాము నుంచే ఆలయానికి తరలివచ్చిన స్వాములు చన్నీటి స్నానాలు ఆచరించి, ప్రత్యేక శరణు ఘోషలతో స్వామివారిని కీర్తించారు.అయ్యప్ప స్వాములు , తమ గురుస్వాముల మరియు వడ్డే లక్ష్మయ్య ఆధ్వర్యంలో పడిపూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పవిత్ర కార్యక్రమాన్ని తిలకించేందుకు మరియు అయ్యప్ప స్వాముల ఆశీస్సులు పొందేందుకు మోకిల గ్గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదానం, తీర్థ ప్రసాద వితరణ జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామయ్య తివారి గారు మాట్లాడుతూ, అయ్యప్ప దీక్ష కేవలం భక్తిని మాత్రమే కాక, మనిషిలో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుందని తెలియజేశారు. భక్తులు మరియు స్వాముల శరణు ఘోషలతో మోకీల నరసింహ స్వామి ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గిరి,ప్రసాద్,శ్రీనివాస్,శేఖర్,మల్లికార్జున్,శ్రీకాంత్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని , అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని కోరారు.

