వారం లోపు నిర్ణయం తీసుకోండి : ధర్మాసనం అల్టిమేటం


జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పీకర్ వ్యవహార శైలిని కఠినంగా ప్రశ్నిస్తూమీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మేమే తీసుకోవాలా?అని ఆగ్రహంతో వ్యాఖ్యానించింది. మూడు నెలల్లోగా ఫిరాయింపు కేసుల్లో తీర్పు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టంగా తెలిపింది. అంతేకాక, స్పీకర్‌పై రాజ్యాంగ రక్షణ ఉంటుందని అనుకోవద్దని, ఈ విషయంపై కోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చినట్లు గుర్తుచేసింది.

ధర్మాసనం ఇంకా ఒక ముఖ్యమైన సూచన చేసింది: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే స్పీకర్ కోర్టు ధిక్కారానికి సిద్ధం కావాలని హెచ్చరించింది. విచారణను రోజువారీగా నిర్వహించి నిర్ణయం ఇవ్వాలని కూడా ఆదేశించింది. విచారణలో కొంత వ్యంగ్యంగా సీజేఐ గవాయి వ్యాఖ్యానిస్తూ స్పీకర్ గారు న్యూ ఇయర్‌ను ఎక్కడ జరుపుకోవాలనే నిర్ణయం ఆయనే తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు. ఇది స్పీకర్ ఆలస్యం వల్ల కోర్టు అసహనం ఎంత ఉన్నదో ప్రతిబింబించింది.

ఈ నేపథ్యంలో స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్ మరియు ముకుల్ రోహత్గి కోర్టుకు సమాధానమిస్తూ నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పీకర్‌కు అధికారిక నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లో తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం మీద, స్పీకర్ ఆలస్యం రాజ్యాంగబద్ధ బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉందని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా రాజ్యాంగపరమైన వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కోర్టు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.

You may also like...

Translate »