చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన

- మీర్జాగూడ ప్రమాదంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం
- నాలుగు లేన్ల రహదారి కోసం ప్రజల పోరాటం విస్మరించిన ప్రభుత్వం
- పేదల ప్రాణాల కంటే ఫోర్త్ సిటీ ప్రాజెక్ట్‌కే ప్రాధాన్యత : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల:
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మానవ ప్రాణాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మరచిపోయిందని ఆయన తీవ్రంగా స్పందించారు.గతంలో ఆలూరు వద్ద జరిగిన ప్రమాదంలో పది మంది మృతి చెందారు. ఇప్పుడు మళ్లీ అదే రోడ్డు మీద 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఎన్నాళ్లుగానో ఈ రహదారిని నాలుగు లేన్ల జాతీయ రహదారి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా పాలకులకు చలనం లేదు. ఇది మానవతా వైఫల్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ఫోర్త్ సిటీకి ఎనిమిది లేన్ల రోడ్డుకు నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. కానీ మా పేద ప్రజల ప్రాణాలు విలువ లేనివా? ప్రజల భద్రత కంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఫోర్త్ సిటీ ప్రాజెక్ట్ పనులను తక్షణమే నిలిపివేసి, హైదరాబాదు–వికారాబాద్ రోడ్డు, శ్రీశైలం రోడ్లను వెంటనే ఫోర్‌లేన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణాల భద్రతే అభివృద్ధికి అసలు అర్థం. పేదల రక్తం మీద లాభాలు కట్టే అభివృద్ధి నిజమైన పురోగతి కాదు,అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
