తెలంగాణలో రేపు రేషన్ షాపుల బంద్

  • రేపు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు పిలుపు
  • ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని డీలర్ల ఆరోపణ
  • నెలకు రూ.5 వేల గౌరవ వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్
  • ఐదు నెలలుగా పేరుకుపోయిన కమీషన్ బకాయిలపై ఆగ్రహం
  • డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమని హెచ్చరిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :

తెలంగాణలో రేషన్ పంపిణీపై రేపు ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రేషన్ డీలర్లు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి.
ఎన్నికలకు ముందు తమకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆరోపించింది. వీటితో పాటు డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గత ఐదు నెలలుగా కమీషన్ బకాయిలతో పాటు, గన్నీ బ్యాగుల బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంపై డీలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు విమర్శించారు.
తాము ప్రకటించిన ఒకరోజు బంద్‌తోనైనా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని డీలర్లు హెచ్చరించారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా బియ్యం పంపిణీని నిలిపివేస్తామని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడిస్తామని కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు.

You may also like...

Translate »