ఇక భూ వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట

  • 3465 మంది సర్వేయర్లకు నేడు లైసెన్స్‌లు అందజేయనున్న సీఎం

హైదరాబాద్‌: భూముల సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఆ శాఖకు కొత్త శక్తినిస్తూ ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను రంగంలోకి దించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 3465 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆయా సర్వేయర్లకు సీఎం రేవంత్‌రెడ్డి లైసెన్సులు అందజేయనున్నారు. ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు వరకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించాలనేది ప్రభుత్వం లక్ష్యం. రెండో విడతలో మరో మూడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం భూమి కొలతలు-భూ దస్త్రాల నిర్వహణ శాఖలో 612 మండలాలకు సుమారు 330 మంది సర్వేయర్లే ఉన్నారు. కొన్నిచోట్ల ఒక్కొక్కరికీ మూడు మండలాల అదనపు బాధ్యతలు అప్పగించారు.
పటాల రూపకల్పనలో కీలకపాత్ర

భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌కు భూమి సర్వే పటం జోడించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పటాల రూపకల్పనకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సర్వేయర్ల అవసరముంది. దీనిని దృష్టిలో పెట్టుకుని లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. అయితే, సర్వేయర్లకు సంబంధించిన విధి విధానాలు జారీ కావాల్సి ఉంది.

ఇన్నేళ్లు ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ చేస్తున్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో భూమి వివరాలు ఏంటనేది తెలియడం లేదు.
లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు విధుల్లోకి చేరాక..ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోగానే ఆ సమాచారం సర్వేయర్లకు వెళ్తుంది.
ఆ భూమిని సర్వే చేసి పటాన్ని సిద్ధం చేసి మండల సర్వేయర్‌కు అందజేస్తారు. ఆయన దానిని పరీక్షించి ధ్రువీకరిస్తారు. అనంతరం ఆ పటం ఆధారంగా రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ ప్రక్రియను తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ పూర్తి చేస్తారు.
భూమి సర్వే సందర్భంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రెవెన్యూశాఖకు దరఖాస్తు చేసుకుని భూ యజమాని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

You may also like...

Translate »