మోకిలాలో డ్రగ్స్ కదలికలపై పోలీసుల దృష్టి-కొనసాగుతున్న విచారణ

➤ 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం
➤ డ్రగ్స్ విక్రయాలపై నిఘా -పలు వ్యక్తులపై పరిశీలన
➤ బెంగళూరు, గోవా నుంచి రవాణా అనుమానాలు
➤ ఐటీ ఉద్యోగి, వ్యాపార వర్గాల అనుసంధానం పరిశీలనలో
➤ వాహనాలు స్వాధీనం -నెట్‌వర్క్‌పై దర్యాప్తు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ సమీపంలోని మోకిలా ప్రాంతంలో డ్రగ్స్ కదలికలపై ఫ్యూచర్ సిటీ పోలీసులు నిఘా పెంచినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కొంతమంది వ్యక్తుల పాత్రపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రాథమిక వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి సహా మరికొంతమంది ఈ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, గోవా వంటి నగరాల నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్న నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్ల ద్వారా రహస్యంగా డ్రగ్స్ రవాణా జరుగుతున్నదన్న సమాచారాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారంలో ఒక ఐటీ రంగానికి చెందిన ఉద్యోగి, మరో వ్యాపార వర్గానికి చెందిన వ్యక్తి పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారి మధ్య ఉన్న సంబంధాలు, లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలనలో ఉంచినట్లు సమాచారం.
డ్రగ్స్ సరఫరా శృంఖల వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నగరంలో మాదకద్రవ్యాల కదలికలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని సమాచారం.
ఈ వ్యవహారంపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉండగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
