హరీష్‌రావుపై మరోసారి కవిత సెటైర్లు

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ :
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి మాజీ మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ ఆమె సెటైర్లు వేశారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారని ప్రశ్నిస్తూ హరీష్‌రావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పదవి ఇవ్వడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జాగృతి సంస్థే నిలుస్తుందని కవిత స్పష్టం చేశారు. నీళ్ల అంశంపై కేసీఆర్‌కే కాకుండా రేవంత్‌కు, హరీష్‌కు ఎంత అవగాహన ఉందో ప్రజలే గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు బబుల్ షూటర్ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి రాజకీయ ఆటల వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిజంగా బాగుపడుతుందని వ్యాఖ్యానిస్తూ, పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చకు బదులు వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని ఆమె ఆరోపించారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో మరోసారి అంతర్గత రాజకీయ చర్చకు దారితీశాయి.
