చేవెళ్లలో ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పామేన భీమ్ భరత్

- అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రికి సమాచారం
- కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి వెళ్లాలని సూచన
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, ప్రభుత్వ సాయంపై డిమాండ్
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలైన ఘటనపై చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎంతో హృదయవిదారకమని పేర్కొంటూ, వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
భీమ్ భరత్ మాట్లాడుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీకి సమాచారం అందించామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ ఘటన మళ్లీ జరగకుండా రహదారి భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భీమ్ భరత్ పేర్కొన్నారు.
