కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్

- స్త్రీనుదుటి సింధూరం కోసం…
- శత్రువు స్థావరాలపై సింధూర దాహం
- ఆపరేషన్ సింధూర్ – భీకర ప్రతీకారం!
ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో శోకసంద్రంలో మునిగిపోయింది. మెడలో మంగళసూత్రం తో కళకళలాడే భార్య చేతుల్లో ఇప్పుడు భర్త ఫోటో మాత్రమే మిగిలింది. నిన్నటిదాకా భర్తకు భోజనం పెట్టిన చేతులు, ఈరోజు ఆ ఫోటోని పట్టుకుని విలపిస్తున్నాయి. గర్వంగా నిలబడే సింధూరానికి బదులుగా కన్నీటి చుక్కలు మారాయి.
“భారత స్త్రీ కన్నీళ్లకు మేమే గళం… పగకు మేమే ప్రతీకారం!” అంటూ, ఇప్పుడు అదే జాతి “ఆపరేషన్ సింధూర్” రూపంలో ప్రతీకారాన్ని ఎంచుకుంది. ఈ పేరు ఒక్కటే కాదు — ఇది లక్షలాది భార్యల మౌన రోదనలకు సమాధానం. భారత భద్రతా దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై పగబట్టి దాడులు జరిపాయి. ఈ దాడులు కేవలం బుల్లెట్ల ధ్వని కాదు… ప్రతి పేలుడు వెనక ఓ భార్య వెతలు ఉన్నాయి. ప్రతి బాంబు వెనక ఓ తల్లికి పోయిన కొడుకు బాధ ఉంది. ప్రతి మిస్సైల్ వెనక ఓ కుమార్తెకి దూరమైన తండ్రి గుర్తు ఉంది.
భారత సైనికులు ఈ దాడుల్లో కేవలం ఆదేశాలను పాటించలేదు – వారు ప్రతీ బులెట్ను “ఇది నా సోదరి కోసం”, “ఇది నా భార్య కోసం”, “ఇది నా తల్లికి” అనే భావంతో వదిలారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం స్పష్టం చేసింది – ఒక భారత స్త్రీ నుదుటి సింధూరాన్ని తుడిచే దుర్మార్గులు భూలోకంలో జీవించలేరు. సింధూరం కేవలం అలంకారం కాదు… అది భారత గౌరవానికి ప్రతీక. దానిని తుడిచే వారికి సమాధానంగా ఈ సింధూర దాహం రూపంలో ఉగ్రశక్తులను నాశనం చేయడం అనివార్యం.
ఇప్పుడు దేశమంతా గర్వంగా నిలబడి ఉంది. ఒక్కొక్క నోరు “భారత్ మాతాకీ జై!” అంటోంది. ప్రతి గుండె ధైర్యంతో నిండిపోయింది.
ఒక భారత స్త్రీకి అన్యాయం జరిగితే – ఈ దేశం ఎంతకైనా తెగిస్తుంది.
చిమ్మిన కన్నీటిని చీకటి మంటగా మార్చి, న్యాయం చేసే వరకు నిలబడుతుంది.
— జ్ఞాన తెలంగాణ ప్రతినిధి