నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక
- జాతీయ అధ్యక్షుడి ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ గ్రామానికి రాక
- బ్యాతల శివ శంకర్ కుటుంబంపై దాడికి కఠిన చర్యల డిమాండ్
- సర్పంచ్ భర్త పాత్రపై తీవ్ర ఆరోపణలు – తక్షణ అరెస్టు కోరుతూ పిలుపు
- అట్రాసిటీ కేసు నమోదు ఆలస్యం పై పోలీసులపై మండిపాటు
- వేలాదిగా టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ శ్రేణుల తరలివెళ్లే సన్నాహాలు
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యదర్శి, చేవెళ్ల ఇన్‌చార్జ్ బ్యాతల శివ శంకర్ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ నేడు మధ్యాహ్నం 12 గంటలలోపు టంగుటూరు గ్రామానికి చేరుకోనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు భారీ ఎత్తున గ్రామానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
జరిగిన ఘటనలో ఉద్దేశపూర్వక దాడి జరిగిందని, బాధితులు క్షమాపణ కోరినప్పటికీ వినకుండా అగ్రకుల గుంపులు దాడికి దిగిన తీరు తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోందని ఎమ్మార్పీఎస్ నేతలు పేర్కొన్నారు. కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించిన దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన వెనుక ఉన్న గ్రామ సర్పంచ్ భర్తను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని, సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.
గ్రామంలో చట్టవ్యవస్థను పక్కనబెట్టి అగ్రకుల అహంకారానికి అండగా నిలిచే చర్యలు కొనసాగితే తీవ్ర ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేస్తున్న పోలీసుల వైఖరిపై మందకృష్ణ మాదిగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కేసు నమోదు చేయకుండా కాలయాపన చేయడం బాధితులపై ద్వంద్వ వైఖరి చూపినట్టేనని మండిపడ్డారు.
టంగుటూరులో శాంతి భద్రతలు కాపాడాలని, న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్ స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో మందకృష్ణ మాదిగ స్వయంగా గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉందని సమాచారం. జిల్లాలోని ఎమ్మార్పీఎస్ శ్రేణులు, దళిత, బహుజన సంఘాలు పెద్దఎత్తున టంగుటూరుకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

