రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఐదేళ్ల పిల్లలకు పాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల పోషకాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదట ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. పాల సరఫరా బాధ్యతలను రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్యకు చెందిన విజయడెయిరీకి అప్పగించారు. ప్రస్తుతం గర్భిణులు, బాలింతలకు రోజూ 200 మిల్లీలీటర్ల చొప్పున నెలకు సుమారు 15 లక్షల లీటర్ల పాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు పిల్లలకు 100 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వాలంటే పది లక్షల లీటర్ల అదనపు అవసరం ఉంటుందని గుర్తించింది. ఈ నేపథ్యంలో అత్యుత్తమ నాణ్యత గల టెట్రా ప్యాక్‌లలో పాలను సిద్ధం చేసి పంపిణీ చేయాలని విజయడెయిరీకి ఆదేశాలు జారీ చేశారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని విజయడెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.