అంగనవాడి పిల్లలకు రేపటినుంచి పాలు

– పోషకాహార లోపం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వ కొత్త కార్యక్రమం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అంగనవాడి కేంద్రాల ద్వారా చిన్నారులలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొత్త, సృజనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

ములుగు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఈ పథకం రేపటినుంచి ప్రారంభమవుతోంది. 3 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలకు ప్రతి రోజూ సాయంత్రం అంగనవాడి కేంద్రాల్లో గోరువెచ్చని పాలు అందించనున్నారు. ఈ పథకం మొదటి దశలో ములుగు జిల్లాలోని నాలుగు ICDS ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 7,918 మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు.

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంవత్సరానికి 200 పని దినాలు అమలుకానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల తల్లిదండ్రులు ఉదయం పనులకు వెళ్లిపోవడం వల్ల పిల్లలకు సరైన సమయంలో పోషకాహార ఆహారం అందకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది.

పిల్లల ఎదుగుదలకు తోడ్పడే పథకం

ఈ పరిస్థితుల వల్ల చాలామంది పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ కొత్త పాల పథకం ఈ లోపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ తరానికి ఇది మార్గదర్శక కార్యక్రమమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

You may also like...

Translate »