స్టీల్ పళ్లెంలోనే భోజనం:మహాలింగపురం అయ్యప్ప స్వాములు

  • పర్యావరణానికి మద్దతుగా మహాలింగపురం అయ్యప్ప స్వాములు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి :
మహాలింగపురం గ్రామ సన్నిధానం అయ్యప్ప స్వాములు పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి మార్గదర్శక చర్యకు నాంది పలికారు. పెళ్లిళ్లు,పంక్షన్‌లు,పండుగలు,అన్నదానాలు,ఇళ్లలో జరిగే చిన్న చిన్న విందులు ఎక్కడ చూసినా నేడు పేపర్ ప్లేట్లు,ప్లాస్టిక్ ప్లేట్లు,ప్లాస్టిక్ గ్లాసుల వాడకం పెరిగిపోతోంది.పేపర్ ప్లేట్ల మీద ఉండే ప్లాస్టిక్ కోటింగ్ వల్ల వేడి ఆహారం వడ్డించినప్పుడు ప్లాస్టిక్ కరిగిపోతుంది. ఆ కరిగిన పదార్థం మనం తినే ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరమని, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయని మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ సౌకర్యం కోసం చాలామంది వాటినే వాడుతూ వస్తున్నారు.ఈ పరిస్థితుల్లో పర్యావరణానికి మేలు చేయాలనే సంకల్పంతో మహాలింగపురం గ్రామంలోని అయ్యప్ప స్వాములు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ విందులు,అన్నదానాలు,పండుగలలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు మాత్రమే వాడాలని నిర్ణయించారు.
ఈ ప్రయత్నం ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకూ దోహదపడుతుందని, ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ పాత్రలు వాడడం వల్ల చెత్త తగ్గుతుందని, వృథా ఖర్చులు తగ్గుతాయని,శుభ్రత పెరుగుతుందని అన్నారు.

You may also like...

Translate »