జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ : మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించింది. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపడం లేదని మావోయిస్టులు ప్రశ్నించారు. 2 నెలలుగా తాము సంయమనం పాటించామని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్ పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖను విడుదల చేశారు. కాగా, ఈనెల (మే) 21వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది చనిపోయారు. వారిలో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. ఆయన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పక్కా సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని పోలీసుల భద్రతా బలగాలు చుట్టుముట్టాయని మావోలు భావిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగానే మావోయిస్టు కేంద్ర కమిటీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది