కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురితో సహా ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,నవంబర్ 2:
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ (40)పై కత్తితో దాడి చేశాడు. దాడిలో అలివేలు, శ్రావణి, హనుమమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.పెద్ద కూతురు అపర్ణ తీవ్ర గాయాలతో తప్పించుకొని స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం యాదయ్య తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ కలహాలు ఇంత దారుణానికి దారితీయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
