మలావత్ పూర్ణకు పితృవియోగం

- ఆకాశంలో నక్షత్రమైన దేవీదాస్
కామారెడ్డి జిల్లా,సిరికొండ మండలం :
దేశానికి గర్వకారణమైన ఎవరెస్టు యోధురాలు మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్ (50) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దేవీదాస్ ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన దేవీదాస్ కూలీ వృత్తితో జీవనం సాగిస్తూ, తన కుమార్తె పూర్ణ ఎదుగుదల వెనుక నిశ్శబ్ద శక్తిగా నిలిచాడు. గ్రామీణ పేద కుటుంబంలో జన్మించిన పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినప్పుడు, తండ్రి చూపిన ఆనందం, గర్వం గ్రామమంతా గర్వపడేలా చేసింది. ఆ తండ్రి ఈరోజు లేరన్న వార్త పాకాల, సిరికొండ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వగ్రామమైన పాకాలలో నిర్వహించనున్నారు. మలావత్ కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సంతాపం తెలిపారు.
