పటాన్ చెరు రూప కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

- మూడు ఫైర్ ఇంజిన్లతో మంటల అదుపు యత్నాలు ..
- పక్క పరిశ్రమలకు మంటలు వ్యాపించే భయం
పటాన్ చెరు, నవంబర్ 2(జ్ఞాన తెలంగాణ):
పారిశ్రామిక వాడలో కలకలం పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆదివారం సెలవు కావడంతో పరిశ్రమలో కార్మికులు లేనందున పెద్ద ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
భారీగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న సీతార ఫ్లోర్ మిల్ వరకు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఘటన స్థలానికి పటాన్ చెరు పోలీసులు చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంటల కారణాలపై విచారణ ప్రారంభించినట్టు సమాచారం.
