స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల:
- అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం
- మొత్తం ఐదు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహణ
- రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
- మూడు విడతల్లో సర్పంచ్ స్థానాలకు పోలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎస్‌ఈసీ రాణికుముదిని
తెలంగాణలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు.
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాణి కుముదిని ఎన్నికల వివరాలను వెల్లడించారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తామని, అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని వివరించారు.
సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతామన్నారు. రెండో విడతకు అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక మూడో విడతకు అక్టోబర్ 25న నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి, నవంబర్ 8న పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని రాణి కుముదిని వెల్లడించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలోని 555 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముఖ్యమైన తేదీలివే :
- మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణ0-
- రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణ
- అక్టోబర్ 9 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు
- అక్టోబర్ 13 నుంచిఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు
- అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్
- అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్
- నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహణ
- అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ
- అక్టోబర్ 17 నుంచి 19 వరకు తొలి విడత నామినేషన్ల స్వీకరణ.
- సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 31న తొలి విడత పోలింగ్, ఫలితాలు.
- సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 21న రెండో విడత నోటిఫికేషన్.
- రెండో విడతలో అక్టోబర్ 21న నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.
- నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్, ఫలితాలు.
- మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25న నోటిఫికేషన్.
- మూడో విడతలో అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్ల స్వీకరణ.
- మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 8న పోలింగ్, ఫలితాలు.