జీవో 317పై కవిత లేఖ- బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్

జీవో 317పై కవిత లేఖ – బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్
➤ సీఎంకు బహిరంగ లేఖ రాసిన కవిత
➤ జీవో 317తో వేలాది ఉద్యోగులు ఇబ్బందులు
➤ ఎన్నికల హామీ నిలబెట్టాలని డిమాండ్
➤ వన్‌టైమ్ రిలీఫ్‌తో స్వస్థలాలకు బదిలీలు కోరింపు
➤ స్థానికత నిబంధనల్లో మార్పులపై పట్టు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి : జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు తక్షణ న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2021 డిసెంబర్ 6న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 కారణంగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీవో 317ను వ్యతిరేకిస్తూ, ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్న జీవో 317ను వెంటనే రద్దు చేసి, వన్‌టైమ్ రిలీఫ్ కింద స్థానికత ఆధారంగా వారి స్వస్థలాలకు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇక స్థానికతను నిర్ణయించే నిబంధనల్లో కూడా సమూల మార్పులు అవసరమని కవిత అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో 317 బాధితులకు న్యాయం జరిగేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు.

