బోడంపహాడ్, సర్దార్ నగర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

  • పేదల కలలను సాకారం చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం : పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :

చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం బోడంపహాడ్ మరియు సర్దార్ నగర్ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం కార్యక్రమాన్ని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు. లబ్ధిదారులకు నియామక పత్రాలు అందజేసి, పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన ఆయన, పేద ప్రజల గృహ కలను సాకారం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

భీమ్ భరత్ మాట్లాడుతూ, “ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబం సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం పొందుతుంది. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించనున్నది. ప్రస్తుత విడతలో సొంత భూమి కలిగిన లబ్ధిదారులకే ఇళ్లను మంజూరు చేస్తున్నాం” అని తెలిపారు.

అంతేకాక, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి అదనంగా రూ.1 లక్ష సాయం అందించనున్నట్లు వెల్లడించారు. “బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు సాయం అందించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అండగా నిలుస్తోంది. ఎన్నికల హామీని నెరవేర్చుతూ ఈ పథకం రూపుదిద్దుకుంది” అని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మహిళల పేరుమీద మంజూరు చేయడం ద్వారా మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భీమ్ భరత్ తెలిపారు. “మహిళలు బలంగా ఉన్నప్పుడు రాష్ట్రం బాగుంటుంది. అందుకే ఇళ్ల పట్టాలు మహిళల పేరుమీద ఇవ్వడం అనేది సమాజ అభివృద్ధికి దోహదం చేసే నిర్ణయం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, మాజీ సర్పంచ్ తమ్మాలి రవీందర్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మన్మరి మాజీ సర్పంచ్ సత్యనారాయణ, అంతరం మాజీ సర్పంచ్ బుచ్చయ్య, నాయకులు నర్సిములు, నవీన్, కరణ్, గణేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You may also like...

Translate »