కేజీబీవీ బెడ్స్ టెండర్లలో భారీ అక్రమాలు?

– సీబీఐ విచారణకు గెల్లు డిమాండ్
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్ల కేటాయింపులో రూ.100 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం లోకాయుక్తను కలిసి అధికారిక ఫిర్యాదు సమర్పించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి నిర్బంధం లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు చదివే కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక వసతుల పేరుతో టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.
నాసిరకం బంకర్ బెడ్స్ సరఫరా చేసి, టెండర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ట్రూఫా, ముఫత్లాన్ కంపెనీలకు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక బెడ్ ధరను సుమారు రూ.12 వేలుగా నిర్ణయించి, స్థానిక ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే బెడ్డును రూ.35 వేల వరకు కొనుగోలు చేస్తూ ఒక్కో బెడ్డుపై దాదాపు రూ.22 వేల మేర అధిక అంచనా వేసి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చుతున్నారని విమర్శించారు.
