కొత్త రేషన్ కార్డు దారులకుట్రిపుల్ బొనాంజా ప్రకటించిన సర్కార్

– రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
– కొత్త రేషన్ కార్డుదారులకి ట్రిపుల్ బొనాంజ
– సెప్టెంబర్ నుంచే అమలు
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. జులై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది. ఈక్రమంలో రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఒకేసారి మూడు బొనాంజాలు ప్రకటించింది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మూడు బొనాంజాల విషయానికి వస్తే.. వీటిల్లో మొదటిది ఏంటంటే.. మూడు నెలల రేషన్ పంపిణీ తర్వాత.. సెప్టెంబర్ నుంచి మళ్లీ రేషన్ పంపిణీ మొదలు కానుంది.దీనిలో భాగంగా సన్నబియ్యం ఇస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం ఇవ్వనున్నారు. దీనితో పాటు వీరికి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించనుంది. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాత రేషన్ కార్డు దారులతోపాటుగా కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి కూడా త్వరలోనే ఆరోగ్యశ్రీ వర్తించనుంది. మరో వారం గడిస్తే ఇది కొత్త వారికి కూడా అమల్లోకి వస్తుందని సమాచారం.ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పేర్లు ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఈ పని పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 461 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తున్నాయి. కొత్తగా కార్డు పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని పొందేందుకు అర్హులవుతారు. దీని ద్వారా వీరికి 10 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.
ఈ రెండింటితో పాటు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకి మూడో బొనాంజా కూడా ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకి ప్రత్యేక రేషన్ బ్యాగులని ఉచితంగా ఇవ్వనున్నారు. పర్యావరణానికి మేలు చేసే, తెల్లని రేషన్ బ్యాగుల ధర బయట రూ.50 నుంచి రూ.70 దాకా ఉంటుంది. అయితే సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం వీటిని ఉచితంగానే ఇవ్వబోతుంది. ఇకపై రేషన్ లబ్ధిదారులు ప్రతి నెల ఈ బ్యాగుల్లోనే రేషన్ బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇప్పటికే ఈ బ్యాగులు రేషన్ డిపోలకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 1న ఈ బ్యాగ్ ఇచ్చిన తర్వాతే రేషన్ పంపిణీ ఉంటుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వ ఆరు గ్యారెంటీలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఈ బ్యాగ్ ఇచ్చినప్పుడు వేలి ముద్ర తీసుకుంటారు. ఆ తర్వాత బియ్యం ఇచ్చే సమయంలో మరోసారి వేలి ముద్ర తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఈ బ్యాగులను తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
