తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..


మొక్కజొన్న పంట ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి తుమ్మల చర్చించారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాలేదని.. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.

గత సంవత్సరం కూడా కేంద్రం కేవలం మద్దతు ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు రూ.535 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ సీజన్ లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని తెలిపారు.

సెప్టెంబర్ 3 వ వారం నుండే మార్కెట్లోకి భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSP (₹2,400/క్వింటల్) కన్నా ₹441 తక్కువగా రూ. 1,959 రూపాయలు ఉందని, దీని వలన మొక్క రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. 8.66 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపైరూ.2400 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికీ రాష్ట్ర రైతుల ప్రయోజనార్థం మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతులు తమ ఉత్పత్తిని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందవలసిందిగా రైతులకు సూచించారు.

రాష్ట్రంలోని మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఈ మద్దతు ధర అవకాశాన్ని వినియోగించుకొని, తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేయకుండా, మార్క్ ఫెడ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని రైతులను కోరారు. అదేవిధంగా PSS స్కీం కింద కేంద్రం కొనుగోలు చేసే పెసర, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించిందని, రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనగోలు చేయడానికి ఈ సీలింగ్ అడ్డంకిగా మారుతుందని మంత్రి తుమ్మల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సీలింగ్‌ను దాటి రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. మొక్కజొన్న, జొన్న లాంటి పంటలకు కేవలం మద్దతు ప్రకటనలకే పరిమితం కాకుండా ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లైతే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదని, రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటవుంతుని మంత్రి అభిప్రాయపడ్డారు.

You may also like...

Translate »