యూరియా కోసం రైతుల ఆరి గోస

- రైతులకు తప్పని తిప్పలు
- వేకువ జాము నుంచే పడిగాపులు
జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 13 :
ఆరుగాలం కష్టపడి ఉన్న భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులను యూరియా కలవర పెడుతుంది. ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో యూరియా దొరకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతులు తిండి తిప్పలు మాని పొద్దుమావు లేకుండా సింగిల్ విండో కార్యాలయాల వద్ద నీరిక్షిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో యూరియా కొరత వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితిలు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి శనివారం రెండు లారీలు 888 బస్తాల యూరియా వచ్చింది. దీంతో వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ సిబ్బంది రైతు వేదిక వద్ద క్యూలో ఉన్న 428 మంది రైతులకు సీరియల్ ప్రకారం అధికారులు టోకెన్లు అందజేశారు. టోకెన్లు తీసుకున్న రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్ద చెరుకుని మళ్లీ అక్కడ క్యూలో నిల్చున్నారు. తొమ్మిది గంటల నుంచి వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, సీఈఓ మల్లారెడ్డి పర్యవేక్షణలో పోలీసులు వహారాలో ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పున సాయంత్రం ఐదు గంటల వరకు పంపిణీ చేశారు. సోమవారం మరో రెండు లారీల యూరియా వస్తుందని అధికారులు తెలుపడంతో యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగిపోయారు.