హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో:


హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణహిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌ రంగాల్లో భాగస్వామ్యం పంచుకోనుంది. కాగా, కిటాక్యుషు నగర మేయర్‌ కజుహిసా టేకుచితో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదుల పునరుజ్జీవ విధానాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈఎక్స్‌, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, పీ9 ఎల్‌ఎల్సీ, నిప్పాన్‌ స్టీల్‌ ఇంజనీరింగ్‌, న్యూ కెమికల్‌ ట్రేడింగ్‌, అమితా హోల్డింగ్స్‌ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై తెలంగాణ ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యుషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్‌ టేకుచి వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.

You may also like...

Translate »