కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించండి:కేటీఆర్‌

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :

జూబ్లీహిల్స్‌ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణభవన్‌ అనే జనతా గ్యారేజ్‌ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలం అందరం వచ్చి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ‘ఇప్పుడే ఒక సర్వే వచ్చింది. మన గెలుపు భారీగా ఉండబోతున్నట్టు ఆ సర్వేలో తేలింది. జూబ్లీహిల్స్‌లో 4 లక్షల మంది ఓటేస్తే 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. కాంగ్రెస్‌ను దెబ్బ కొడితేనే వాళ్లు మనకు ఇచ్చిన హామీలు అమలవుతాయి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే మేం ఏం చేయక పోయినా నాకే ఓటేస్తారనుకొని రేవంత్‌ ఏ పనీచేయరు. అందుకే ఆలోచించి ఓటేయండి. హైడ్రా పేరు చెప్పి పేదల ఇండ్లు కూలగొడుతున్నారు. హైడ్రా పేరుతో రియల్‌ ఎస్టేట్‌ను, అన్ని వ్యాపారాలను నాశనం చేశారు. బుల్డోజర్‌ ఎప్పుడు వచ్చి తమ ఇంటిని కూలగొడుతుందో అని ప్రజలు కంటిమీద కునుకులేకుండా భయంభయంగా గడుపుతున్నారు’ అని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. రహమత్‌నగర్‌ డివిజన్‌లో ఎస్పీఆర్‌ హిల్స్‌ నుంచి శ్రీరామ్‌నగర్‌ బస్టాండ్‌ వరకు రోడ్‌ షో నిర్వహించిన కేటీఆర్‌.. అక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏం చేశారని రద్దు చేస్తారు?
‘రద్దు చేస్తా.. రద్దు చేస్తా అంటున్నరు. ఏం షురూ చేసినరని రద్దు చేస్తరు’ అని కాంగ్రెస్‌ను కేటీఆర్‌ నిలదీశారు. అత్తకు రూ. 4 వేలు ఇస్తున్నరా? కోడలుకు రూ.2,500 వస్తున్నదా? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నరా? యువతులకు స్కూటీలు ఇచ్చారా? నిరుద్యోగులకు రూ.5 లక్షల నిరుద్యోగ భృతి కార్డులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రద్దు చేయాలని చూస్తే, ఇదే జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతారని హెచ్చరించారు. ఎగిరెగిరి పడ్డ ఎంతోమంది నియంతలకు బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉన్నదని గుర్తుచేశారు. దీనికి రేవంత్‌రెడ్డి కూడా మినహాయింపు కాదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైపోయిందని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే రెట్టింపు మెజార్టీ రాబోతోందని చెప్పారు. ఈ నెల 11వ తేదీన జూబ్లీహిల్స్‌లోని 4 లక్షల మంది ఓటేస్తే రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్‌ సీఎంగా వస్తారని పేర్కొన్నారు. 2023లో గోపీనాథ్‌కు రహమత్‌ నగర్‌ డివిజన్‌ నుంచి ఆరువేల మెజార్టీ వచ్చిందని, మీ ఉత్సాహాన్ని చూస్తుంటే ఇప్పుడు 12 వేల మెజార్టీ వస్తదనే నమ్మకం ఉన్నదని అన్నారు. నవంబర్‌ 14న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి సునీతతో ఇక్కడే మళ్లీ సంబురాలు చేసుకుందామని ధీమా వ్యక్తంచేశారు.
ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు
జూబ్లీహిల్స్‌ ఒక సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. రెండేండ్లలో ఒక్క మంచి పని అయినా చేశారా? గీ మంచి పనిచేసినం అని ఓట్లు అడిగే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు ఉన్నదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడ్తదని నగర ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చారని, హైదరాబాద్‌ మొత్తం గెలిచినా దురదృష్టవశాత్తు ఓడిపోయామని అన్నారు. ‘శివమ్మ, పాపిరెడ్డి హిల్స్‌ (ఎస్పీఆర్‌)లో రూ. 500-600 కోట్ల విలువైన జాగాను గోపీనాథ్‌ కాపాడారు. ఇప్పుడు ఆ జాగాలోనే ఆటల పోటీలు, క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్నయి. నీళ్ల సమస్యను గోపీనాథ్‌ పరిష్కరించారు. అన్నా అంటే నేనున్న అన్నట్టు గోపీనాథ్‌ ఉన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చి, చీరె పెట్టిన నాయకుడు గోపీనాథ్‌. ఆయన ఆకస్మిక మరణంతో పెండ్లి కూడా కాని ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు ఆపదలో పడ్డారు. అలాంటి కుటుంబానికి కేసీఆర్‌ అండగా నిలబడ్డారు. ఈ ఆడబిడ్డను కేసీఆర్‌ మీ ముంగటికి పంపించారు. భర్త చనిపోయి 6 నెలలుగా కూడా కాలేదు. కార్యకర్తలను చూడగానే భర్త గోపీనాథ్‌ గుర్తొచ్చి సునీతమ్మ ఏడిస్తే కూడా కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేస్తున్నారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఏడుపును కూడా రాజకీయం చేసిన అరాచక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం సీఎం, 14 మంది మంత్రులు కాలుకు బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారు. రెండేండ్లలో ఒక్క మంచి పని అయినా చేశారా? గీ పని చేసిన అని ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాదు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాదని, ఓడిపోతామని రేవంత్‌రెడ్డికి కూడా అర్థమైందని కేటీఆర్‌ చెప్పారు. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘గత పదేండ్లలో మేం కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నాం. కానీ, ఒకసారైనా మాకు ఓటేయక పోతే పథకాలు బంద్‌ చేస్తామని బెదిరించామా? కానీ రేవంత్‌రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తారు. ఎంతోమంది నియంతలకు బుద్ధిచెప్పిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉన్నది. రెండేండ్లలో ఏం చేశారని రద్దు చేయడానికి. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామని మాట తప్పారు. యువతులకు సూటీ అన్నారు. ఒక హామీని కూడా అమలు చేయలేదు. ఏమైనా అంటే ఫ్రీ బస్సు అంటారు. ఆడవాళ్లకు ఫ్రీ అంటారు, మగవాళ్లకు డబుల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ లేదు, రంజాన్‌ తోఫా లేదు, క్రిస్మస్‌ గిఫ్ట్‌ లేదు, తులం బంగారం లేదు. అన్నీ రద్దయిపోయాయి. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ఇవ్వలేదు. మైనార్టీలకు ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయలేదు. ఓడిపోతామని రేవంత్‌రెడ్డికి కూడాఅర్థమైంది. రేవంత్‌రెడ్డి పదవి తాతాలికమే. రెండేండ్లు అయిపోయింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్‌ సీఎంగా వస్తారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
గత పదేండ్లలో మేం కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నాం. ఒకసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్‌ చేస్తామని బెదిరించామా? కానీ రేవంత్‌రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తారు. ఎంతోమంది నియంతలకు బుద్ధిచెప్పిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉన్నది.
– కేటీఆర్‌
మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి
మాగంటి సునీతాగోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఒక చాన్స్‌ ఇవ్వాలని కేటీఆర్‌ విజ్ఞప్తిచేశారు. ‘ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. మీకు అండగా నిలబడుతం. ఎస్పీఆర్‌హిల్స్‌లోనే స్టేడియం కడతాం దానికి గోపీనాథ్‌ పేరు పెడదాం. కాంగ్రెస్‌కు మోకా ఇస్తే వాళ్లేమో ధోకా ఇచ్చారు. రూ. 4వేల కోట్లు ఇస్తామని మోసం చేశారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు మంచి సంబంధం ఉన్నది. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్‌ బంధం. బీజేపీతో ఉన్నది పేగుబంధం. పిల్లను ఇచ్చిన మామను కూడా బండ బూతులు తిట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. సెటిల్‌మెంట్‌ చేసే బ్లాక్‌మెయిలర్‌ ఇప్పుడు సెంటిమెంట్‌ గురించి మాట్లాడుతున్నరు. సీఎం మంచిమాటలు చెప్తరని ప్రజలు ఆశిస్తరు. కానీ, పేగులు మేడలో వేసుకుంటా అంటాడు. నువ్వేమైనా బోటికొట్టేవాడివా? కేసీఆర్‌ ఉన్నప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్‌వన్‌ అయితే ఇప్పుడు లాస్ట్‌ ప్లేస్‌కు చేరుకున్నది. 11న మీరు ఓటేయకపోతే కాంగ్రెస్‌ నేతలు దొంగ ఓట్లు వేస్తారు. ఈవీఎంలో పై నుంచి మూడో నంబర్‌ ఉన్నది కారు గుర్తు. మిగితావి అన్ని బేకార్‌’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

You may also like...

Translate »