రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం – సీఎం రేవంత్ ఆదేశాలు

– ప్రాజెక్టుల వారీగా విశ్లేషణలు జరిపి నివేదికలు సమర్పించాలి
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 29 : రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపై సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి, వాటిపై వివరమైన నివేదికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టును వేర్వేరుగా విశ్లేషించి, సాంకేతిక వివరాలతో కూడిన రిపోర్టులు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ లేఖపై సమీక్ష : కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యూషన్ (CDSE) పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ (CR Paatil) ఇటీవల రాసిన లేఖను ముఖ్యమంత్రి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు వివరించి, వాటిని అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.
డ్యామ్‌లపై పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్టులు: ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రాజెక్టు వారీగా స్టేటస్ రిపోర్టులు తయారు చేయాలని సూచించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అవసరమైన మరమ్మత్తులు, పునరుద్ధరణ పనుల కోసం తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటి బాధ్యతను సంబంధిత ఏజెన్సీలకే అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నవంబర్ రెండో వారంలో మరో సమీక్ష సమావేశం: రాబోయే నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రాజెక్టుల వారీగా సిద్ధమయ్యే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలపై చర్చ జరగనుంది.
తుమ్మిడిహట్టి – సుందిళ్ల ప్రణాళికలు: తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది.
ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సౌకర్యం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని తెలిపారు.
సుందిళ్ల–శ్రీపాద ఎల్లంపల్లి నీటి మార్గం: సుందిళ్ల ప్రాజెక్టును మరమ్మత్తు చేసి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు మరియు అంచనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

— జ్ఞాన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
