చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష – కంట్రోల్ రూమ్ ఏర్పాటు

– మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలనీ, ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి :
గాయపడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు గాంధీ మరియు ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని కాపాడేందుకు వైద్య బృందాలను హెల్త్ ఎమర్జెన్సీ మోడ్‌లో సిద్ధంగా ఉంచాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు :
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ప్రమాదానికి సంబంధించి సమాచారం, క్షతగాత్రులు, బంధుమిత్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకోవడానికి కింది నంబర్లను సంప్రదించవచ్చు.
📞 కంట్రోల్ రూమ్ నంబర్లు:
- 9912919545
- 9440854433
సహాయక చర్యల పర్యవేక్షణ కొనసాగింపు :
ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఘటనపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాలనీ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ మద్దతు అందించాలనీ స్పష్టం చేశారు.
