కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశాలు

- GHMC స్థానంలో కొత్త చట్టం
- చెత్త నిర్వహణకు ప్రత్యేక స్థలాలు, మన్నికైన రోడ్ల నిర్మాణం
- వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ పర్యవేక్షణకు డ్యాష్‌బోర్డ్, సీసీ కెమెరాలు
- ఎత్తైన భవనాలకు ఆధునిక అగ్నిమాపక సదుపాయాలు, వర్షపు నీటి సంరక్షణ
- పర్యావరణ పరిరక్షణతో పాటు ట్రాఫిక్ రద్దీ నివారణ చర్యలు
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
ఔటర్ రింగ్ రోడ్ (CURE) పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టం స్థానంలో ప్రత్యేకంగా ‘కోర్ అర్బన్ చట్టం’ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలన్నింటికీ ఒకే విధమైన చట్టపరమైన వ్యవస్థ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ దిశగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ పరిధిలో తొలి దశలోనే పనులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.
కోర్ అర్బన్ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త వేయాల్సిన నిర్దిష్ట స్థలాలు లేకపోవడంతో ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వ్యర్థాలను పారేస్తున్న పరిస్థితి ఉందని గుర్తించారు. ముందుగా చెత్త సేకరణ మరియు పారవేయడానికి గుర్తించిన ప్రాంతాలను స్పష్టంగా గుర్తించి, అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో సాంకేతికతను వినియోగించి సమర్థవంతమైన మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు.
రోడ్ల నిర్మాణం విషయంలోనూ నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో నిర్మించే రోడ్లు నిర్దేశిత కాలపరిమితి వరకు మన్నికగా ఉండేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని చెప్పారు. తరచూ మరమ్మతులు అవసరం లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. నగరంలోని ప్రతి వీధి దీపం వెలుగుతున్నదా లేదా అన్న సమాచారం డ్యాష్‌బోర్డ్‌లో ప్రత్యక్షంగా కనిపించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించే విధంగా వ్యవస్థ ఉండాలన్నారు.
ఫుడ్ సేఫ్టీ అంశంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి హోటళ్లు తీసుకుంటున్న చర్యలను నిరంతరం సమీక్షించాలన్నారు.
ఫైర్ సేఫ్టీ విషయంలోనూ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. 50 అంతస్తులకు పైగా భవనాలు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆధునిక పరికరాలు, సాంకేతిక సదుపాయాలు సమకూర్చుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే విధంగా ఫైర్ సర్వీసులను బలోపేతం చేయాలని సూచించారు.
నగరంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల నిల్వ పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కోర్ అర్బన్ ప్రాంతంలో ఆర్ అండ్ బీ మరియు ఇతర విభాగాల పరిధిలో ఉన్న రోడ్లన్నింటినీ మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి ఏకరీతి పరిపాలన అమలు చేయాలని సూచించారు.
నగర ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని, నగర సౌందర్యవర్థక చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన అనుమతులు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలేయకుండా, వాటి రక్షణతో పాటు సుందరీకరణ చర్యలు చేపట్టాలని చెప్పారు. నీటి వనరులను కాపాడటం, నగర పర్యావరణాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైడ్రా కమిషనర్, ఎంఆర్డీసీఎల్ ఎండీ, మూడు కార్పొరేషన్ల కమిషనర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగర అభివృద్ధిని సమగ్ర దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, కోర్ అర్బన్ ప్రాంతాన్ని ఆధునిక, శుభ్రమైన, సాంకేతికంగా సుస్థిర నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
