యూరియా కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం : సీఎం రేవంత్ రెడ్డి

- పలు మార్లు వినతులు స్వయంగా సమర్పించిన కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన
- 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కు గాను 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని వివరణ
- అవసరమైన మేరకు తక్షణం యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు వివరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు రైతాంగానికి తలెత్తాయని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా గారికి, సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.యూరియా సరఫరా విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రి గారికి వివరించడమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు దఫాలుగా లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు.రైతుల సమస్యలపై పార్లమెంట్ వేదికగా ఎంపీలు ఆందోళన సాగిస్తున్నప్పటికీ కోటా మేరకు యూరియా విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు. అవసరమైన మేరకు తక్షణం యూరియా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి గారు కోరారు.
