ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

– ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు


జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన అసభ్యకర, నిందారోపణాత్మక వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ధిక్కరించి ప్రత్యర్థి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా, ఓటర్లలో ద్వేషం మరియు అనుచిత భావోద్వేగాలను రేకెత్తించేలా చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని నేతలు విమర్శించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగగా జరగాలని, కానీ సార్వజనిక వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెస్తుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికలు శాంతియుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పి.శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »