స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:
తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా కాలరాయబడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ముఖ్యమంత్రి హోదాకు తగినదిగా లేదని, “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా… స్ట్రీట్ రౌడీవా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై చావు మాటలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతిని దిగజార్చే చర్యగా పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రశ్నలు లేవనెత్తే సమయంలో మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మైక్ కట్ చేస్తానని స్పీకర్ ఆన్ రికార్డ్‌లో హెచ్చరించారని, “ముఖ్యమంత్రిపై మాట్లాడొద్దు” అని స్పీకర్ చెప్పడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. స్పీకర్ పూర్తిగా ప్రభుత్వ పక్షాన నిలబడి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉండి ప్రయోజనం లేదని పేర్కొంటూ, స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ప్రస్తుత శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు.

You may also like...

Translate »