రామారావు హత్య పై భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

  • పాతర్లపాడు గ్రామంలో సీపీఎం నేత సామినేని రామారావు హత్య
  • వాకింగ్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి
  • దోషులను కఠినంగా శిక్షిస్తాం : భట్టి హెచ్చరిక
  • క్లూస్, సైబర్ టీమ్స్‌తో దర్యాప్తు ఆదేశం
  • కుటుంబానికి ప్రభుత్వం అండ
  • మాజీ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రామారావు
  • ఘటనతో ఖమ్మం జిల్లాలో కలకలం

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం, అక్టోబర్ 31:

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు రాజకీయ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ హింసాత్మక రాజకీయాలకు చోటు లేదు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం”అని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం క్లూస్ టీమ్, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీమ్‌ల సహాయంతో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, “వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుంది” అని భరోసా ఇచ్చారు.

తెల్లవారుజామున వాకింగ్‌కి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రామారావుపై దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకొన్ని రోజుల్లో ఆయన మనవరాలి వివాహం ఖమ్మంలో జరగనుండగా ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సామినేని రామారావు పార్టీకి కట్టుబాటైన నేతగా గుర్తింపు పొందాడు. ప్రజలతో మమేకమై ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయనను సహచరులు, స్థానికులు స్మరించుకుంటున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఈ ఘటనతో ఖమ్మం రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

You may also like...

Translate »