తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం!

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,నవంబర్ 04:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన మరువక ముందే తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైది
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ పరిధిలోని,రాజీవ్ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, రేణికుంట శివారులో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో సహా బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
