కదం తొక్కిన కాటన్‌ రైతు

  • కొనుగోలు నిబంధనలపై జాతీయ రహదారి దిగ్బంధం
  • భోరజ్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల భారీ నిరసన
  • సీసీఐ తేమ నిబంధనలతో పత్తి కొనుగోలు నిలిచిందన్న ఆరోపణలు
  • సోయా కొనుగోళ్లలో వేలిముద్ర–ఓటీపీ సమస్యలు రైతులకు కొత్త బాధ
  • కేంద్రం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని జోగు రామన్న విమర్శ
  • ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందకపోవడంపై ఆగ్రహావేశం

జ్ఞానతెలంగాణ,ఆదిలాబాద్ ,నవంబర్ 22:

అదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల పంట కొనుగోలు విధానాలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. కపాస్, సోయా కొనుగోళ్లలో అమలు చేస్తున్న నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ధ్వనించారు. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతుల వల్ల వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఈ నిరసనలో బీఆర్‌ఎస్‌తోపాటు పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. “పీఎం ఝాటా – సీఎం ఝూటా… ఇద్దరూ కలిసి రైతులను మోసం చేస్తున్నారు” అంటూ నినాదాలు మార్మోగాయి.

అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ… కిసాన్ యాప్‌ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంలో సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తోందని, తేమ ఎక్కువ ఉందని సాకుతో అనేక మంది రైతుల పత్తిని తిరస్కరిస్తోందని విసురుగా పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారని, సోయా కొనుగోళ్లలో వేలిముద్రలు, ఓటీపీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల రైతులు మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో మద్దతు ధర పొందలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తమైంది. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపైనే జొన్న రొట్టెలు తిని ప్రత్యేక నిరసన తెలిపారు.

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మద్దతు ఇవ్వడమే ధ్యేయంగా పత్తి, సోయా కొనుగోళ్లు సాగుతున్నాయని మండిపడ్డారు. తేమ నిబంధనల పేరిట సీసీఐ రైతులను తిరస్కరిస్తుండగా స్థానిక బీజేపీ నాయకులు ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు. అఖిలపక్షం చేపట్టిన దిగ్బంధం విజయవంతమైందని, రెండు ప్రభుత్వాలు కదిలేలా రైతులు పోరాటం చేశారన్నారు.

స్థానిక రైతులు తమ వేదనను వెల్లడిస్తూ… సీసీఐకి అమ్మినా మద్దతు ధర అందడంలేదని, తేమ పేరుతో తక్కువ రేట్లు నిర్ధారిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.8110 మద్దతు ధర మార్కెట్ యార్డుల్లో అందకపోవడం వల్ల రైతులు భారీ నష్టాలు భరిస్తున్నారని వాపోయారు.

You may also like...

Translate »