కేంద్రంపై మండిపోయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి


• కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలు ఎలా?
• ట్రైబ్యునళ్ల రద్దుపై కేంద్రం పై గవాయ్ తీవ్ర ఆగ్రహం
• స్వల్ప మార్పులతో పాత నిబంధనలు తెచ్చారా? ప్రశ్నించిన ధర్మాసనం
• విచారణ తప్పించుకునే యత్నమా? కేంద్ర వాదనపై న్యాయమూర్తి అసహనం



జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ :

ఫిల్మ్ సర్టిఫికేషన్ సహా పలు ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లో అమలు చేసిన ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టంపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు తీవ్ర పదజాలానికి దారితీశాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ బార్ సంఘం సహా అనేక మంది దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఇప్పటికే గతంలో కొట్టివేసిన పలు నిబంధనలను స్వల్ప మార్పులతో తిరిగి చట్టంగా తీసుకురావడం రాజ్యంగ వ్యవస్థను బలహీనపరచే ప్రమాదకర విధానమని ఆయన హెచ్చరించారు. “కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తే దీన్ని ఎలా సమర్థిస్తారు? న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పార్లమెంటు కూడా పక్కన పెట్టలేదు” అంటూ ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసును వాయిదా వేయాలని, వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిపై కూడా జస్టిస్ గవాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నా నుండి తప్పించుకునేదేనా? నేను పదవి విరమణ పొందే వరకు తీర్పు రావద్దని అనుకుంటున్నారా?” అంటూ తేలికపాటి ఒత్తిళ్లతో న్యాయ ప్రక్రియను మళ్లించాలనే ప్రయత్నాలను తప్పుపట్టారు. చివరిగా, ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టంలోని రాజ్యాంగ విరుద్ధ నిబంధనలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం కోర్టు తీర్పులను నిర్లక్ష్యం చేయడం సముచితం కాదని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడం ఎప్పటికీ సహించబోదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.



You may also like...

Translate »