చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియో ప్రకటన
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం
  • గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

You may also like...

Translate »